: గర్భధారణ కోసం 'సంతాన యోగ'
యోగాభ్యాసంలో ఓ నూతన ప్రక్రియను షెర్రీ లాంగ్‌బాటం అనే నర్సు మరియు యోగా శిక్షకురాలు ఆవిష్కరించింది. సంతానయోగ అని పేరు పెట్టిన ఈ యోగాను పాటించడం వలన ఆధునిక తరంలో ఉరుకులు పరుగుల మీద ఉండే దంపతుల్లో గర్భధారణ అవకాశాలు మెరుగుపడతాయని ఆమె చెబుతోంది. సాధారణంగా యోగా అనేదే మనిషిని రిలాక్స్ చేస్తుందని.. యోగాలో తను రూపొందించిన సులువైన పద్ధతుల్ని అవలంబించడం వలన.. గర్భధారణ అవకాశాలు మెరుగుపడతాయని అంటోంది.
ప్రస్తుతం ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ట్రీట్‌మెంట్ లేదా హార్మోన్ థెరపీ అనేది గర్భధారణకు ఉత్తమ మార్గంగా పనిచేస్తోంది. అయితే దీనివలన కొంత ఆందోళనకు గురికావడం ఉంటుందని... అయితే తాను రూపొందించిన సంతాన యోగా వలన అలాంటి దుష్ప్రభావాలు ఉండవని లాంగ్‌బాటం చెబుతోంది. క్లీవ్‌లాండ్ యూనివర్సిటీ డాక్టర్ జేమ్స్ గోల్డ్‌ఫార్బ్ కూడా యోగా, ఆక్యుపంక్చర్ లాంటి ప్రత్యామ్నాయ పద్ధతులు గర్భధారణ విషయంలో మెరుగైన ఫలితాలిస్తాయని ధ్రువీకరిస్తున్నారు.