: మేము చేసిన తప్పేంటి?.... కేసులపై సరోజనీ కంటి ఆసుపత్రి వైద్యుల ఆవేదన!
హైదరాబాదులోని ప్రభుత్వ వైద్యశాల సరోజని కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు వికటించిన ఘటనపై తెలంగాణ సర్కారు కొరడా ఝుళిపించింది. ఆపరేషన్లు చేసిన వైద్యులపై కేసులు పెట్టింది. ముందూ వెనుకా చూసుకోకుండా ప్రభుత్వం పెట్టిన కేసులపై వైద్యులు ఆగ్రహంతో పాటు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం పెట్టి మరీ వైద్యులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. అయినా ఆపరేషన్లు వికటించడానికి తమ నిర్లక్ష్యమేమీ కారణం కాదని చెప్పిన వైద్యులు... కేవలం టీఎస్ఎంఐడీసీ సరఫరా చేసిన మందుల్లోని బ్యాక్టీరియా కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తాము ఆపరేషన్లు చేస్తే... నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీఎస్ఎంఐడీసీ సరఫరా చేసిన నాణ్యత లేని మందుల వల్ల బాధితుల చూపు పోయిందని ఆరోపించారు. తప్పు చేసిన టీఎస్ఐఎండీసీని వదిలేసి జాగ్రత్తగా శస్త్ర చికిత్సలు చేసిన తమపై కేసులెలా పెడతారని ప్రభుత్వాన్ని నిలదీశారు. అకారణంగా తమపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే శస్త్ర చికిత్సలు వికటించిన ఏడుగురిలోని ఇద్దరికి సులువుగానే కంటి చూపు వస్తుందని చెబుతున్న వైద్యులు, మిగిలిన బాధితులకు కూడా కంటి చూపు తెప్పించేందుకు చర్యలు చేపడతామని ప్రకటించారు.