: తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు.. ఆదిలాబాద్‌లోని జైనథ్‌లో అత్యధికంగా 6.8 సెం.మీల వర్షం
తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో సగటున 3.6 సెం.మీ వర్షపాతం నమోదయింది. జైనథ్‌లో అత్యధికంగా 6.8 సెం.మీ వర్షపాతం నమోదయింది. కాగజ్‌నగర్‌లో పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మందమర్రి మండలం బొక్కలగుట్ట దగ్గర పాలవాగుకు వరద ఉద్ధృతి పెరిగింది. కరీంనగర్ జిల్లా రామగుండం సింగరేణి ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నిన్న రాత్రి నుంచి వరంగల్ జిల్లాలో పలు చోట్ల మోస్తరు వర్షం కురుస్తోంది. ఖమ్మం జిల్లాలోని ఇల్లందు, మెదక్ జిల్లాలోని పలు చోట్ల, హైదరాబాద్ శివారు ఉప్పల్, రామాంతపూర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. రంగారెడ్డిలోని మేడ్చల్, కీసరలో ఓ మోస్తరు వర్షం పడుతోంది. నల్గొండలోని యాదగిరిగుట్ట, పోచంపల్లి, మిర్యాలగూడ, కనగల్‌లో చిరుజల్లులు పడుతున్నాయి.