: నాకు ఉద్యోగమిస్తే... నీ ఉద్యోగం ఊడుతుంది!: స్మార్ట్ పల్స్ ఎన్యూమరేటర్ తో చంద్రబాబు సరదా కామెంట్!
సందర్భం దొరికితే చాలు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తనదైన చమత్కారంతో జనాన్ని నవ్వుల్లో ముంచెత్తుతున్నారు. నిన్న ఏపీవ్యాప్తంగా మొదలైన స్మార్ట్ పల్స్ సర్వే... చంద్రబాబు నుంచి వివరాల సేకరణతోనే లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా తన వివరాలు సేకరించేందుకు రంగంలోకి దిగిన ఎన్యూమరేటర్ కు తనదైన శైలిలో చలోక్తులు విసిరి అక్కడి వారినందరినీ నవ్వుల్లో ముంచెత్తారు. వివరాల్లోకెళితే... చంద్రబాబు నుంచి వివరాలు సేకరించే క్రమంలో ఎన్యూమరేటర్ ఆయన ‘ఉద్యోగం’ గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా తనకు ఉద్యోగం లేదని వ్యాఖ్యానించిన చంద్రబాబు... నీవేమైనా ఇస్తావా? అని సరదా కామెంట్ చేశారు. ఈ కామెంట్ తోనే షాక్ తిన్న సదరు ఎన్యూమరేటర్ నోరు విప్పేలోగానే మరోమారు చంద్రబాబే అందుకున్నారు. ‘‘నన్ను నిరుద్యోగి అనుకుని సంక్షేమ పథకాలు ఏమైనా మంజూరు చేసేవు. నీ ఉద్యోగం పోతుంది’’ అని చంద్రబాబు అనడంతో సదరు ఎన్యూమరేటర్ తో పాటు అక్కడున్న వారంతా నవ్వేశారు.