: భారత్ విజయగాథను మోదీ అభివర్ణించిన వైనం!
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ భారత విజయ గాథను చక్కగా అభివర్ణించారు. జొహెన్నెస్బర్గ్లోని ‘ద డోమ్’ ఆడిటోరియంలో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ.. భారత విజయగాథ గురించి మాట్లాడుతూ ఆకట్టుకున్నారు. ఆశావాదమే భారత విజయ సూత్రమన్న ప్రధాని భారత విజయగాథను ‘హోప్’(హెచ్ఓపీఈ) అనే నాలుగు అక్షరాల్లో వివరించవచ్చన్నారు. హెచ్ అంటే హార్మోనీ(సామరస్యం) ఓ అంటే ఆప్టిమిజమ్(ఆశావాదం) పీ అంటే పొటెన్షియల్(సామర్థ్యం) ఈ అంటే ఎనర్జీ(శక్తి)గా అభివర్ణించారు. 2022 నాటికి 50 కోట్ల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం 7.6 శాతంగా ఉన్న వృద్ధి రేటును మున్ముందు 8 శాతానికి తీసుకెళ్తామన్నారు. సమాచారం, ఆలోచనలను పంచుకునేందుకు డిజిటల్ విప్లవానికి ఓ రూపం ఇస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. సౌతాఫ్రికాలానే భారత్ కూడా యువ దేశమన్న ప్రధాని దేశ ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని ముందుకు నడిపించేందుకు యువత అవసరం ఎంతో ఉందన్నారు. రెండు దేశాల మధ్య బంధాలు బాగున్నా మరింత కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. కాగా మొజాంబిక్ నుంచి గురువారం రాత్రి మోదీ సౌతాఫ్రికా చేరుకున్నారు. శుక్రవారం ద్వైపాక్షిక చర్చల అనంతరం భారత్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు జరిగాయి.