: జకీర్ నాయక్ టీవీ ప్రసారాలు నిలిపివేత!
బంగ్లాదేశ్ లో ఢాకా బేకరీపై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను తన ప్రసంగాలతో ప్రేరేపించిన వివాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ కు చెందిన 'పీస్ టీవీ' ఛానల్ ప్రసారాలను కేంద్రం నిలిపేసింది. దుబాయ్ నుంచి టెలికాస్ట్ అవుతున్న పీస్ ఛానెల్ పై ఇప్పటికే బ్యాన్ ఉన్నప్పటికీ కేబుల్ ఆపరేటర్లు కేబుల్ నెట్ వర్క్ ద్వారా దీనిని ప్రసారం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 24 ఛానెల్స్ అక్రమంగా టెలికాస్ట్ అవుతుండగా, వాటిలో 11 ఛానెల్స్ పాకిస్థాన్ కు చెందినవి కావడం విశేషం. దీంతో కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసి, క్షణాల్లో వాటిని నిలుపుదల చేయించింది. దీనితోపాటు జకీర్ నాయక్ పై నిఘా పెట్టింది. అందులో భాగంగానే జకీర్ కు చెందిన పీస్ టీవీకి ఎలాంటి లైసెన్స్ లేదని గుర్తించారు. అలాగే ఆన్ లైన్ తో పాటు యూట్యూబ్ లో ఉన్న జకీర్ నాయక్ వివాదాస్పద ప్రసంగాలను తొలగించాలని ఆయా సంస్థలను ఆదేశించింది. మరోపక్క మహారాష్ట్ర ప్రభుత్వం జకీర్ ట్రస్ట్ కార్యకలాపాలు, విరాళాలపై దర్యాప్తు జరుపుతోంది. దేశ వ్యాప్తంగా జకీర్ నాయక్ పై వ్యతిరేకత వ్యక్తమవుతుండగా, జమ్మూకాశ్మీర్ లో కొంత మంది యువకులు జకీర్ నాయక్ కు మద్దతుగా ర్యాలీ తీశారు. 'నీవెంటే మేము' అంటూ ప్లకార్డులు కూడా ప్రదర్శించారు.