: నా జీవిత కథతో సినిమా తీస్తే ప్రధానపాత్రలో నటించాలని ఉంది: లాలూ ప్రసాద్ యాదవ్
తన జీవిత కథ ఆధారంగా సినిమా తీస్తే నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ‘మదారి’ చిత్ర ప్రచార కార్యక్రమంలో ఉన్న హీరో ఇర్ఫాన్ ఖాన్ ను నిన్న లాలూ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన జీవిత కథ ఆధారంగా తెరకెక్కించే ఏ చిత్రంలోనైనా ప్రధాన పాత్ర పోషించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఆ సినిమాకు హీరోయిన్ ను ఎంపిక చేయాల్సిన బాధ్యత ఇర్ఫాన్ దేనని అన్నారు. నటన విషయంలో పేరున్న సినీ నటులకు తాను ఏమాత్రం తీసిపోనని అన్నారు. నటుడు దిలీప్ కుమార్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన లాలూ, నాటి హీరోయిన్లు వైజయంతిమాల, హేమమాలినిలను ప్రశంసలతో ముంచెత్తారు.