: వైఎస్ రాజశేఖరరెడ్డి పంచె కట్టి రైతులకు చేసిన సేవ ఇదీ!: చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు
వైఎస్ రాజశేఖరరెడ్డి డ్రెస్సు చూసి 2004లో ఆయనకు రైతులు ఓట్లు వేశారని, అయితే, ఆయన పరిపాలనలోనే ఎక్కువ ఆత్మహత్యలు జరిగాయని.. వైఎస్ పంచెకట్టి రైతులకు చేసిన సేవ ఇదేనంటూ ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు మెరుగు పరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తొలి సమావేశం నిర్వహించారు. ఆ విశేషాలను ప్రభుత్వ కాల్వ శ్రీనివాసులు మీడియాకు వివరిస్తూ, ‘రాజశేఖర రెడ్డిగారి పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగమంటున్నారు.. ఆయన పంచె కట్టుకుని పొలాలన్నింటిని బంగారం చేశారంటున్నారు. సూట్ వేసుకుని పరిశ్రమలకు ఆయన అడ్రసుగా మారారంటున్నారు. 2004లో ఆయన డ్రెస్సు చూసి రైతులు ఓట్లు వేశారు. ఆయన పరిపాలనలో దేశంలో ఎక్కడా జరగనన్ని రైతుల ఆత్మహత్యలు మన రాష్ట్రంలో జరిగాయి. రాజశేఖరరెడ్డిగారి పాలనలో కరెంట్ సమస్య వల్ల చిన్న తరహా, మధ్య తరహా యూనిట్లు మూతపడిపోయాయి. కార్మికులు బజారు పాలైపోయారు. ఇదేనా, ఆయన హయాంలో సాధించిన పారిశ్రామిక ప్రగతి? అవినీతికి కేరాఫ్ అడ్రసుగా ఆంధ్రప్రదేశ్ ను మార్చి, ప్రతిపక్షాల కార్యకర్తలను, నాయకులను భయ భ్రాంతులను చేసి, సర్కార్ హత్యలు చేసి, పరిటాల రవీంద్రగారి లాంటి నాయకుడిని ప్రభుత్వమే స్వయంగా హత్య చేయించిన సంఘటనలు చూశాం. ఇలాంటి ఒక దుర్మార్గమైన పరిపాలనకు మేము వారసులమని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. ప్రజల్లోకి వెళ్లే నైతికహక్కు ఆయనకు ఎక్కడ ఉందని మేం అడుగుతున్నాము’ అని పేర్కొన్నారు.