: చిన్నారి సానియాను కస్తూర్భా ట్రస్టు భవన్‌లో ఉంచండి: కోర్టు ఆదేశాలు
ఇటీవల భర్త రూపేశ్ చేతిలో దారుణంగా హత్యకు గురయిన కాంగో దేశస్థురాలు సింథియా కుమార్తె సానియా ఎవరి సంరక్షణలో పెరగాలనే అంశంపై విచారణను రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. చిన్నారి సానియాను కేసు తేలేంతవరకు కస్తూర్భా ట్రస్టు భవన్‌లో ఉంచాలని న్యాయమూర్తి పోలీసులకి ఆదేశాలు జారీ చేశారు. చిన్నారి సానియా తన తల్లి హత్యకు గురయినప్పటి నుంచి ఇప్పటివరకు శిశుసంరక్షణ కేంద్రంలో ఉంటోన్న విషయం తెలిసిందే. చిన్నారి ఎవరి సంరక్షణలో ఉండాలనే అంశాన్ని ఫ్యామిలీ కోర్టే తేలుస్తుందని మొదట రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో శిశుసంరక్షణ కేంద్రంలో ఉంటోన్న సానియాను ఎల్బీనగర్‌లోని ఫ్యామిలీ కోర్టులో హాజరుపరిచారు. అయితే ఫ్యామిలీ కోర్టు మళ్లీ రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి కోర్టుకే వెళ్లాలని చెప్పింది. మళ్లీ సానియాని సదరు కోర్టుకే తీసుకొచ్చారు. దీంతో తాజాగా రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి కోర్టు చిన్నారి అంశంపై పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది. సానియా ఎవరి సంరక్షణలో పెరుగనుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.