: చిన్న కాగితం ముక్కతో సింగపూర్ బ్యాంకును బురిడీ కొట్టించిన వ్యక్తి!
ఆయుధాలేమీ లేకుండా కేవలం కాగితం ముక్కను ఆయుధంగా చేసుకుని 14 లక్షల రూపాయలు బ్యాంకు నుంచి లూటీ చేసిన ఘటన సింగపూర్ లో చోటుచేసుకుంది. నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతారని, అందుకే అక్కడ నేరాలు తక్కువగా జరుగుతాయని పేరున్న సింగపూర్ లో ఈ ఘటన చోటుచేసుకోవడం ఆసక్తిని రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే... లంచ్ సమయంలో సింగపూర్ లోని స్టాండర్డ్ ఛాటర్డ్ బ్యాంకులో ప్రవేశించిన ఆగంతుకుడు క్యాష్ కౌంటర్ లో ఉన్న సిబ్బందికి పలు డిమాండ్లతో రాసిన ఓ కాగితాన్ని అందజేశాడు. దీంతో మారు మాట్లాడని సిబ్బంది అతనికి 22 వేల డాలర్లు (14 లక్షల రూపాయలు) అందజేశారు. ఈ మొత్తాన్ని తీసుకుని అతను నెమ్మదిగా బయటకు వెళ్లిపోయాడు. అనంతరం ఈ ఘటనపై బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిని ఆస్ట్రేలియన్ గా గుర్తించినట్టు తెలిపింది. అతని కోసం ప్రస్తుతానికి గాలిస్తున్నారు. దుండగుడు ఎలాంటి ఆయుధం లేకుండా బ్యాంకును ఎలా బురిడీ కొట్టించాడన్న దానిపై దర్యాప్తు చేపట్టామని భద్రతాధికారులు తెలిపారు.