: కవితలు రాయండి.. గానం చేసి ప్రచారం చేయండి: హరితహారం కార్యక్రమంలో కేసీఆర్
‘కవులు కవితలు రాయండి.. గాయకులు గళాలు విప్పండి.. చెట్ల పెంపకంపై ప్రచారం చేయండి’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లిలో మొక్కలు నాటిన కేసీఆర్.. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. హరితహారంలో రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కళాకారులు ప్రజల్లోకి ఈ పథకాన్ని తీసుకెళ్లాలని ఆయన కోరారు. మానవ జాతికి ఉపయోగపడే వనాల ప్రాధాన్యతను చాటి చెప్పాలని పేర్కొన్నారు. ‘మనం ఎంతగా చెట్లను పెంచితే అంతగా వర్షం వస్తుంది’ అని ఆయన అన్నారు. లక్ష మందితో ఒకే సమయంలో 1.25 లక్షల మొక్కలు నాటడం పెద్ద సాహసమేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సాహసాన్ని తెలంగాణ ప్రజలు చేపడుతున్నారని ఆయన కొనియాడారు. ‘విద్యార్థి నుంచి సీఎం వరకు రెండు వారాలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి’ అని కేసీఆర్ అన్నారు. ‘అడవులు ఉన్న చోట వానలు కురుస్తున్నాయి.. వాగులు నిండుతున్నాయి’ అని ఆయన అన్నారు. కరవును ఎదుర్కోవాలంటే చెట్లను పెంచడమే పరిష్కారమని చెప్పారు. అందరూ ఆకుపచ్చ మహాయజ్ఞాన్ని చేపట్టాలని కేసీఆర్ సూచించారు. నల్గొండ జిల్లాలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి జిల్లాని పచ్చని వనంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. ‘వానలు కొనుక్కుంటే దొరకవు.. చెట్లు పెంచుకుంటే వస్తాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.