: టీడీపీ సర్కారు ఓకే!... ఆ పార్టీ ఎమ్మెల్యేలపై మాత్రం ప్రజల్లో సంతృప్తి లేదట!: తేల్చేసిన చంద్రబాబు సర్వే!
ఏపీలో టీడీపీ సర్కారుపై ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు. అయితే ఆ పార్టీ టికెట్లపై గెలిచిన ఎమ్మెల్యేలపై మాత్రం ప్రజల్లో సంతృప్తి లేదట. ఈ మేరకు ప్రభుత్వ పనితీరుతో పాటు ఎమ్మెల్యేల పనితీరుపై ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్వయంగా చేయించిన సర్వే తేల్చి చెప్పింది. నిన్న విజయవాడలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో ఈ అంశంపైనే ప్రధాన చర్చ జరిగింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయిన నేపథ్యంలో చంద్రబాబు ప్రత్యేకంగా సర్వే చేయించారు. ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది? ఎమ్మెల్యేల పనితీరు ఏ మేరకు ఉంది? అన్న అంశాలపై ప్రధానంగా సాగిన ఈ సర్వే నివేదికను నిన్న చంద్రబాబు సమన్వయ కమిటీ భేటీలో అందరి ముందు పెట్టారు. దాదాపు 5 గంటల పాటు తన కేబినెట్ లోని మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు ఈ భేటీని నిర్వహించారు. ప్రభుత్వ పనితీరుపై మెజారిటీ శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సగానికి పైగా ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు అసంతృప్తితోనే ఉన్నట్లు ఆ సర్వే నిగ్గు తేల్చింది. 30 నుంచి 35 శాతం మంది ఎమ్మెల్యేల తీరు ఫరవాలేదని ప్రజలు ఆ సర్వేకు చెప్పారు. 25 నుంచి 30 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదన్న సర్వే... ఓ 10 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగోలేదని తేల్చేసింది. రెండేళ్లవుతున్నా... ప్రభుత్వ పనితీరుకు అనుగుణంగా ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగుపరచుకోకపోతే ఎలాగంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలను సంస్కరించడమెలా? అన్న అంశంపైనా ఆ భేటీలో సుదీర్ఘ చర్చే నడిచింది. పలు అంశాలు చర్చకొచ్చినా... ఓ కమిటీ వేసి పనితీరు బాగాలేని ఎమ్మెల్యేల పనిబట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ ఏర్పాటుకు సమన్వయ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది.