: రైలు ప్రయాణానికి తప్పనిసరి కానున్న ‘ఆధార్’!
రైలు ప్రయాణానికి ఆధార్ కార్డు తప్పనిసరి కానుంది. ఈ మేరకు రైల్వే శాఖ నిబంధన పెడుతోంది. రిజర్వేషన్ చేసుకోవాలన్నా, అప్పటికప్పుడు టిక్కెట్ కొనాలన్నా ఆధార్ కార్డు ఉంటేనే పనవుతుంది. ఆధార్ కార్డు తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు, సబ్సిడీ టిక్కెట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రెండు దఫాలుగా ఈ పథకాన్ని అమలు చేయాలని, ముందుగా సబ్సిడీ కేటగిరీలకు ఆధార్ కార్డులను లింక్ చేస్తామని, ఈ విధానాన్ని పదిహేను రోజుల్లో అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ విధానాన్ని జనరల్ కేటగిరీకి రెండు నెలల్లో అమలు చేస్తామని చెప్పారు. జనరల్ కేటగిరీలో కూడా ముందుగా రిజర్వ్ కేటగిరీకి ఆధార్ కార్డును లింకు చేస్తామన్నారు. ఆన్ లైన్ రిజర్వేషన్ కు కూడా ‘ఆధార్’ తప్పనిసరని అన్నారు. ప్రతి రైల్వే టిక్కెట్ పైనా ప్రయాణికుడి ఆధార్ కార్డు నంబరుతో పాటు, ఫొటోను, చిరునామా వివరాలను ముద్రిస్తామని, ఈ సమాచారాన్ని టీసీల మొబైళ్లకు పంపిస్తామని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల టిక్కెట్ రిజర్వ్ చేసుకున్న ప్రయాణికుడే ప్రయాణిస్తున్నాడా? లేదా? అనే విషయం టీసీలకు వెంటనే తెలిసిపోతుందని అన్నారు. కాగా, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే సరుకులకు, ఎల్పీజీ సిలిండర్లకు మాత్రమే ఆధార్ కార్డును పరిమితం చేయాలని, మిగతా ప్రభుత్వ సర్వీసులకు ఆధార్ నంబర్ తప్పనిసరి చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఆమధ్య ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయమై సుప్రీంకోర్టు తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.