: భారతీయులకు ప్రయాణాల్లో ఫేస్ బుక్ ఉంటే చాలట!
భారతీయులకు ప్రయాణాల్లో ఫేస్ బుక్ ఉంటే చాలని హోటల్.కామ్ చెబుతోంది. ప్రయాణికులు ప్రయాణాల్లో ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటున్నారన్న విషయాలు తెలుసుకునేందుకు హోటల్.కామ్ సర్వే చేసింది. 31 దేశాల్లో 9,200 మందిపై చేసిన ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. గతంలో ప్రయాణం అంటే ప్రకృతిని ఆస్వాదిస్తూ కాలం గడిపేసేవారు. ఇప్పుడు ప్రయాణికులు అలా ప్రకృతితో మమేకమయ్యేందుకు ఆసక్తి చూపడంలేదట. సోషల్ మీడియాతో గడిపేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. ఇతర సోషల్ మీడియాల కంటే ఫేస్ బుక్ తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని ఈ సర్వే వెల్లడించింది. 40 శాతం మంది యూజర్లు తమ ఫొటోలను అప్ లోడ్ చేస్తూ ఛాటింగ్ చేస్తుండగా, 27 శాతం మంది తాము వెళ్తున్న పర్యాటక ప్రాంతాలతో పాటు దగ్గర్లోని ఇతర పర్యాటక ప్రాంతాల గురించి వెతుకుతున్నారని తెలిపింది. 23 శాతం మంది తాము వెళ్తున్న ప్రాంతాల్లో భోజన సౌకర్యం కోసం ప్రముఖ రెస్టారెంట్ లను సెర్చ్ చేస్తున్నారని ఈ సర్వే తెలిపింది.