: ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం.. హరితహారం కార్యక్రమ నిర్వహణకు సర్వం సిద్ధం
పచ్చని చీర కట్టుకున్నట్లుగా తెలంగాణలోని పది జిల్లాలను తీర్చిదిద్దేందుకు, అడవుల శాతాన్ని పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం రేపటి నుంచి నిర్వహించనున్న రెండో విడత హరితహారం కార్యక్రమానికి సర్వం సిద్ధమయింది. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభించనున్నారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో కేసీఆర్ మొక్కలు నాటనున్నారు. రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనుంది. మరోవైపు రేపు ఒకే రోజు 163 కిలోమీటర్ల పొడవున మొక్కలు నాటనున్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారికి ఇరువైపులా ఈ కార్యక్రమం జరగనుంది. లక్షా 50 వేల మొక్కలు ఒకే రోజు నాటాలని తెలంగాణ ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుంది. ప్రతీ జిల్లాలో ఊరూరా ఉద్యమంలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రెండో విడత హరితహారం కార్యక్రమం కోసం తెలంగాణలోని ప్రతీ జిల్లాలో వందల సంఖ్యలో నర్సరీలను ఎండాకాలానికి ముందే ఏర్పాటు చేశారు. నర్సరీల నుంచి మొక్కలను బయటకు తీస్తున్నారు. హరితహారం ద్వారా పర్యావరణ సమతుల్యతను సాధించాలని తెలంగాణ రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. తెలంగాణను పచ్చగా మార్చేందుకు ప్రతీ ఒక్కరు ముందుకు వచ్చి మొక్కలు నాటాలని ప్రభుత్వం ప్రజలను కోరుతోంది.