: 1500 మంది మహిళలను వేధిస్తే, ఐదుగురు మాత్రమే ఫిర్యాదు చేశారు... కటకటాల వెనక్కి ఓ ప్రబుద్ధుడు!
తనకు ఓ వ్యక్తి ఫోన్ చేసి వేధిస్తున్నాడని ఒక ఐటీ ఉద్యోగిని పోలీసులకు చేసిన ఫిర్యాదు పాత ఢిల్లీలోని ఓ దుకాణదారుడి అరెస్టుకు దారితీయగా, అతన్ని విచారించిన పోలీసులు, అతని నిర్వాకాలు చూసి విస్తుపోయారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, బల్లిమారన్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఖలీద్ (31) మహిళలను వేధించేందుకు తప్పుడు ధ్రువపత్రాలతో 3 సిమ్ కార్డులను కొన్నాడు. తనకు దొరికిన ఫోన్ నంబర్లను సేకరించి, వారితో అసభ్యంగా మాట్లాడటం, ఆపై చెత్త మెసేజ్ లు పెట్టడం, వెంటనే ఫోన్ స్విచ్చాఫ్ చేయడం చేస్తుంటాడు. ఈ సిమ్ కార్డుల్లో దాదాపు 2000 మంది మహిళల ఫోన్ నంబర్లుండగా, గడచిన ఏడాది వ్యవధిలో 1500 మందిని అతను వేధించినట్టు కాల్ రికార్డుల్లో ఉంది. బాధితుల్లో కేవలం ఐదుగురి నుంచి మాత్రమే తమకు ఫిర్యాదులు అందాయని పోలీసులు వెల్లడించారు. తొలుత ఓ టెలీ కాలర్ గా పరిచయం చేసుకుని ఆపై తనను కలవాలని డిమాండ్ చేస్తాడని చెప్పారు. రోజుకు 25 నుంచి 30 మందితో మాట్లాడుతుంటాడని, ఈ నంబర్లను ఫేస్ బుక్, వాట్స్ యాప్ తదితరాల్లో పోస్టు చేస్తానని నిందితుడు బెదిరిస్తుంటాడని తెలిపారు. ఐపీసీ 354ఏ, 354డీలతో పాటు ఐటీ చట్టం కిందా కేసు రిజిస్టర్ చేసినట్టు పేర్కొన్నారు. నిందితుడికి సిమ్ కార్డులను విక్రయించిన సంస్థలకూ నోటీసులు పంపినట్టు వెల్లడించారు.