: మొజాంబిక్ చేరుకున్న నరేంద్ర మోదీ
5 రోజుల ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా మొజాంబిక్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడి ప్రభుత్వం, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఆఫ్రికా దేశాలతో భారత మైత్రిని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాని 4 దేశాల పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. తొలిరోజు ఆయన మొజాంబిక్ దేశాధ్యక్షుడు న్యూసీతో భేటీ కానున్నారు. సాంస్కృతిక బంధం బలోపేతం, ద్వైపాక్షిక అంశాలపై వీరిద్దరి మధ్య చర్చలు సాగనున్నాయి. ఈ సందర్భంగా పలు వాణిజ్య ఒప్పందాలు ఇరు దేశాల మధ్యా కుదరనున్నాయి. ఆపై దేశ చట్టసభ అధ్యక్షురాలు వినోనికా మకామోతో ఆయన సమావేశం కానున్నారు. సాయంత్రం మలౌనాలోని శాస్త్ర, సాంకేతిక పార్కుకు వెళ్లి అక్కడి విద్యార్థులతో ముచ్చటించే మోదీ, అక్కడి నుంచి దక్షిణాఫ్రికాకు పయనమవుతారు. ఆపై టాంజానియా, కెన్యా దేశాల్లోనూ పర్యటించి, 11వ తేదీన తిరిగి భారత్ బయలుదేరనున్నారు.