: సింగిల్ టీ పార్టీ... జయంత్ సిన్హా శాఖను మార్చేసిందట!


మొన్న రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన నరేంద్ర మోదీ కేబినెట్ విస్తరణలో పలు ఆసక్తికర మార్పులు చోటుచేసుకున్నాయి. 19 మంది కొత్తవారికి ఛాన్సిచ్చిన మోదీ... పలువురి శాఖలను మార్చేశారు. సీనియర్ మంత్రి వెంకయ్యనాయుడు నుంచి జూనియర్ మంత్రి జయంత్ సిన్హా దాకా జరిగిన మార్పుల్లో మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రతి మార్పు వెనుకా ఓ కారణముందంటూ మోదీ సర్కారు ఇచ్చిన లీకులు ప్రస్తుతం ఇప్పుడు హాట్ డిబేట్ కు తెర లేపాయి. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రిగా సమర్థవంతంగా పనిచేసిన యశ్వంత్ సిన్హా కుమారుడిగా గత ఎన్నికల్లో రాజకీయ తెరంగేట్రం చేసిన జయంత్ సిన్హా... తొలి యత్నంలోనే పార్లమెంటులో అడుగుపెట్టడమే కాకుండా మోదీ కేబినెట్ లో చోటునూ దక్కించుకున్నారు. తండ్రి మాదిరే ఆర్థిక వ్యవహారాలపై మంచి పట్టున్న జయంత్ ను మోదీ ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా నియమించారు. అయితే మొన్నటి విస్తరణలో భాగంగా జయంత్ ను ఆర్థిక శాఖ నుంచి పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా మార్చారు. పౌర విమానయాన రంగంలో చేపట్టనున్న సంస్కరణలకు సంబంధించి ఆ శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుకు సహాయకారిగా ఉంటారన్న కారణంగానే జయంత్ కు స్థానచలనం కలిగిందని ఓ వాదన వినిపిస్తున్నా... జయంత్ ఇటీవల ఏర్పాటు చేసిన సింగిల్ టీ పార్టీ ఆయనను ఆర్థిక శాఖ నుంచి పౌర విమానయానానికి మార్చేసిందన్న ఊహాగానం కలకలం రేపుతోంది. ఇటీవలే బ్యాంకర్లు, ప్రభుత్వ శాఖల అధికారులకు తన ఇంటిలో టీ పార్టీ ఇచ్చిన జయంత్... సదరు పార్టీకి కొందరు బయటి వ్యక్తులకు కూడా ఆహ్వానం పలికారట. ఈ విషయం తెలుసుకున్న మోదీ ఆయనను ఆర్థిక శాఖ నుంచి తప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News