: అద్దె కారుని అమ్మేస్తూ డబ్బు సంపాదించాలనుకున్నాడు.. చివరికి దొరికిపోయాడు!
వ్యాపారంలో నష్టపోయాడు. ప్రజలను మోసగిస్తూ కాలాన్ని గడిపేద్దాం అనుకున్నాడు. తెలివిగా పథకాన్ని రచించుకున్నాడు. దాన్ని అమలు పరిచే ప్రయత్నాలు కొనసాగించాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. ఢిల్లీలో ప్రజలను మోసం చేస్తూ డబ్బు సంపాదించాలనుకున్న బీసీఏ గ్రాడ్యుయేట్ మింటూ కుమార్ (28) అనే యువ వ్యాపారవేత్త కథ ఇది. తాను చేసిన వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇక డబ్బు సంపాదించాలంటే ప్రజలను మోసం చేయడం ఒక్కటే మార్గం అనుకున్నాడో ఏమో..! ఓ కారుని అద్దెకు తీసుకొని, ఆ కారు తనదే అని చెప్పుకుంటూ ఇద్దరిని మోసానికి గురిచేశాడు. ఆ కారుని అమ్మేస్తానంటూ ఆన్లైన్లో బేరం పెట్టాడు. ఆ కారు తనదేనని కొనుగోలుదారులని నమ్మించడానికి దొంగ రికార్డులు తయారు చేసుకున్నాడు. ఆన్లైన్లో కారుని చూసిన ఓ వ్యక్తి మింటూ కుమార్ దగ్గరకు వచ్చి ఆ కారుని కొనుక్కుని తీసుకెళ్లాడు. అయితే మింటూ ఆ కారుని వదలలేదు. కారుని అమ్మేసిన రోజు రాత్రిపూటే ఆ కారుని కొన్న వ్యక్తి నుంచి డూప్లికేట్ తాళం చెవులతో మింటూ కారుని కాజేశాడు. తర్వాత అచ్చం ఇలాగే మింటూ మరో వ్యక్తిని మోసం చేసి ఇదే కారును మరొకరికి అమ్మాడు. తన కారుని కోల్పోయిన అసలు వ్యక్తి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో అసలు విషయం బయటపడింది. కారు రికార్డులు పరిశీలించిన పోలీసులు ఆ కారు మింటూది కాదని కనుగొన్నారు. అద్దెకు తీసుకున్న ఆ కారుని మింటూ రెండుసార్లు అమ్మేసిన వైనాన్ని గురించి తెలుసుకున్న పోలీసులు మింటూ చేసిన మోసంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చివరకి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మింటూ తండ్రి ఆర్మీలో రిటైర్డ్ కెప్టెన్ అని పోలీసులు తెలిపారు. ఫరీదాబాద్‌లో తాను చేస్తోన్న వ్యాపారంలో నష్టాలు రావడంతో మింటూ ఇలా మోసాలబాట పట్టాడని చెప్పారు.