: రైతు రుణమాఫీపై ప్రభుత్వ తీరు గందరగోళంగా ఉంది: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్
తెలంగాణ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. రైతుల రుణమాఫీ అంశంపై టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు గందరగోళంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయాలంటే బ్యాంకులకు ఇంకా రూ.8,202 కోట్లు చెల్లించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 37 లక్షల మంది రైతుల పాస్ పుస్తకాలు బ్యాంకుల తాకట్టులోనే ఉన్నాయని ఆయన అన్నారు. కరవు పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడానికి ఉద్దేశించి కేంద్రం నుంచి వచ్చిన నిధులు టీఆర్ఎస్ ప్రభుత్వ నేతల చేతిలో దుర్వినియోగం అవుతున్నాయని ఉత్తమ్‌కుమార్ ఆరోపించారు. ఖరీఫ్ సీజన్ మొదలై నెలరోజులు గడుస్తోన్నా రైతుల గురించి ప్రభుత్వం పట్టనట్టు ఉంటూ వారికి విత్తనాలను అందించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన అన్నారు. నాసిరకంతో ఉన్న విత్తనాల సరఫరా జరుగుతోందని, రైతులను ప్రభుత్వం కష్టాల్లో నెట్టేస్తోందని ఆయన విమర్శించారు.