: టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది: తెలంగాణ కాంగ్రెస్ నేతల విమర్శలు
టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శల జల్లు కురిపించారు. ఈరోజు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఓ పక్క ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తుందని, మరోపక్క రైతులకు రుణమాఫీ అంశంపై వెనకంజవేస్తోందని వారు విమర్శించారు. ఖరీప్ సీజన్ ఆరంభమై నెలరోజులు దాటుతున్నా, తెలంగాణలో రైతులకు విత్తనాలు దొరకని పరిస్థితి ఉందని వారు అన్నారు. ప్రభుత్వం తనిఖీలు అంటూ హడావుడి చేసి రాష్ట్రంలోని వందల కళాశాలలు మూతపడేలా చేసిందని వ్యాఖ్యానించారు. పేద ప్రజలకు వైద్య సాయం కూడా అందకుండా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పేర్కొన్నారు.