: భజ్జీ, యువీ నాకు స్నేహితులు...వారిని నేను కొట్టడమా?: షోయబ్ అఖ్తర్
యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ తనకు స్నేహితులని ప్రముఖ క్రికెటర్, 'రావల్పిండి ఎక్స్ ప్రెస్' షోయబ్ అఖ్తర్ తెలిపాడు. 2004లో తాను వారిని కొట్టానంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని తెలిపాడు. అప్పుడు తాము సరదాగా ఆర్మ్ రెజ్లింగ్ చేశామని అన్నాడు. ఇస్లామాబాద్ హోటల్ గదిలో ఆనాడు జరిగిందంతా పెద్ద జోక్ అని అన్నాడు. హర్భజన్ చాలా దూకుడుగా ఉంటాడని చెప్పిన అఖ్తర్...జరిగిన దానిని భజ్జీ ఎక్కువ చేసి చెప్పాడని అన్నాడు. అయినా జూనియర్లను కొట్టడం తనకు ఏమాత్రం ఇష్టం ఉండదని తెలిపాడు. కాగా, 2004లో పాకిస్థాన్ పర్యటన సందర్భంగా బస చేసిన హోటల్ రూంకు వచ్చి తనను, యువీని కొడతానని అఖ్తర్ బెదిరించాడని హర్భజన్ సింగ్ ఇటీవల పేర్కొన్నాడు. అయితే రూంకి వస్తే ఎవరిని ఎవరు కొడతారో చూద్దామని రిటార్ట్ ఇచ్చానని చెప్పిన భజ్జీ, అఖ్తర్ భారీగా ఉంటాడని, బాగా బలంగా ఉండడంతో అతనిని చూసి కాస్త భయపడిన మాట మాత్రం వాస్తవమని అన్నాడు. ఓసారి తనను, యువీని షోయబ్ కొట్టాడని, అతను బలవంతుడు కావడంతో తాము అడ్డుకోలేకపోయామని అన్నాడు.