: టెక్కీ స్వాతి హత్యకేసులో జవాబులు లేని ప్రశ్నలెన్నో... అనుమానాలెన్నో!
చెన్నైలో దారుణ హత్యకు గురైన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి కేసులో, నిందితుడు రామ్ కుమార్ అరెస్టుతో చెన్నై పోలీసులు మర్డర్ మిస్టరీని ఛేదించినట్టు ప్రకటించుకున్నా, ఈ కేసులో సమాధానం లేని ప్రశ్నలెన్నో ఉదయిస్తూ ఉండటంతో, పకడ్బందీగా కేసును ఫైల్ చేసి నిందితుడికి సరైన శిక్ష పడేలా చేయగలరా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. తమిళ్ సెల్వన్... స్వాతి ప్రయాణించే రైలులోనే నిత్యమూ ప్రయాణించే ఓ కాలేజీ ప్రొఫెసర్. స్వాతి హత్యకు గురైన రోజున దాదాపు 50 అడుగుల దూరంలో నుంచి ఈ హత్యను చూశాడు. ఇక ఇదే తమిళ్ సెల్వన్, హత్యకు పది రోజుల ముందు స్వాతిని ఓ యువకుడు చెంపదెబ్బ కొట్టాడని, ఆ యువకుడు, రామ్ కుమార్ వేరువేరని చెబుతున్నారు. స్వాతిని కొట్టిందెవరు? అన్న ప్రశ్నకు పోలీసుల వద్ద సమాధానం లేకపోయింది. ఇక రామ్ కుమార్ ఆనవాళ్లు గుర్తించి అతను ఏఎస్ మాన్షన్ రూము నంబర్ 404లో ఉంటాడని తొలుత చెప్పిన ఓ ప్రైవేటు సంస్థ సెక్యూరిటీ గార్డు నటేషన్ ఇప్పుడు కనిపించడం లేదు. స్వాతి హత్య కేసులో కీలక సాక్షి కాబట్టి అతను పోలీసుల కస్టడీలో ఉండి వుండవచ్చని తెలుస్తున్నా, ఈ విషయమై అధికారికంగా ప్రకటనేదీ లేదు. ఇక రామ్ కుమార్ కు స్వాతిని ఫేస్ బుక్ లో పరిచయం చేసిన సూర్య ప్రకాశ్ అనే మరో యువకుడి ఆచూకీపై కూడా సమాధానాలు లేని ప్రశ్నలే ఉన్నాయి. ఈ సూర్య ప్రకాశ్ ఎవరు? అతనికి స్వాతి హత్య గురించి తెలుసా? తనకు సంబంధం లేకుంటే పోలీసుల ముందుకు ఎందుకు రాలేదు? వంటి ప్రశ్నలకు జవాబు తెలియాల్సి వుంది. ఇక ఈ కేసును అన్ని కోణాల నుంచి విచారిస్తున్నామని, ఏ అవకాశాన్నీ వదలబోమని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియకుంటే, చార్జ్ షీట్ దాఖలు తరువాత లొసుగులను వాడుకుని రామ్ కుమార్ కఠిన శిక్షను తప్పించుకునే ప్రమాదముందన్న వాదన వినిపిస్తోంది.