: విరాట్ కోహ్లీ ‘దూకుడు’ అంటే నాకు ఇష్టం: టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ దూకుడంతే తనకు ఇష్టమని, ఆ దూకుడు విరాట్‌కు సహజ సిద్ధంగా లభించిందని టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే అన్నారు. మరో రెండు రోజుల్లో టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈరోజు బెంగళూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో కుంబ్లే మాట్లాడుతూ.. కోహ్లీ దూకుడును తాను అడ్డుకోబోనని చెప్పారు. తాను కూడా దూకుడు గానే ఉంటానని ఆయన పేర్కొన్నారు. ఆటగాళ్లలో ఉన్న సహజత్వాన్ని తాను ఎప్పుడూ అడ్డుకోబోనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉందని, ఈ పర్యటన ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని కుంబ్లే అన్నారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. టీమిండియాతో అనిల్ కుంబ్లే వంటి కోచ్ ఉండడం తమ అదృష్టమని పేర్కొన్నాడు. అనిల్ కుంబ్లేకు విశేషమైన అనుభవం ఉందని, టీమిండియాకు అది కలిసొచ్చే అంశమని అన్నాడు. కుంబ్లే తొలి అంతర్జాతీయ సవాల్కు సిద్ధమయ్యారని ఆయన అన్నాడు. వెస్టిండీస్‌తో సిరీస్ గెలుచుకొస్తామని విరాట్ ధీమా వ్యక్తం చేశాడు.