: సదావర్తి భూములను మా అబ్బాయి నిబంధనలకు అనుగుణంగానే కొన్నాడు!: కాపు కార్పొరేషన్ చైర్మన్ వివరణ
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దయతోనే తాను కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపికయ్యానని, తనపై విపక్షాలు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నాయని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ వ్యాఖ్యానించారు. ఓ టెలివిజన్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వైకాపా నేతల వ్యవహార శైలి ''వంక లేనమ్మ డొంక పట్టుకుని వేలాడినట్టు" ఉందని అన్నారు. సదావర్తి భూములను తన కుమారుడు కొన్నాడు కాబట్టి ఆ వంకను పట్టుకుని తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వేలం పెట్టిందని, వ్యాపారం నిమిత్తం తన కుమారుడు వాటిని నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు చేశాడని చెప్పుకొచ్చారు. వేలం బహిరంగంగా జరిగిందని, నేడు విమర్శలు చేస్తున్న వారు వేలం జరిగిన రోజున వచ్చి పాడుకుని ఉండవచ్చు కదా? అని ప్రశ్నించారు. తన కుమారులు రూ. 22 కోట్లు పెట్టి కొన్న ఆస్తిని రూ. 30 కోట్లు ఇస్తే ఎవరికైనా ఇచ్చేస్తానని సవాల్ విసిరారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎకరా రూ. 6 కోట్లు కాదని, మహా అయితే రూ. కోటి లేదా రూ. కోటిన్నర మాత్రమే ఉంటుందని తెలిపారు. వేలంలో పాల్గొన్న తమిళ వ్యాపారులు రూ. 10 లక్షలు మాత్రమే కోట్ చేశారని గుర్తు చేశారు.