: సీబీఐ చేతికి తమిళనాట దొరికిన రూ. 570 కోట్ల కేసు
గడచిన మే నెలలో తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న వేళ, తిరుపూర్ జిల్లాలో పట్టుబడ్డ రూ. 570 కోట్లు ఎక్కడివన్న విషయాన్ని దర్యాఫ్తు చేసే బాధ్యతలు సీబీఐ చేతికి వెళ్లాయి. డీఎంకే నేత టీకేఎస్ ఇళంగోవన్ వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది. కాగా, కంటెయినర్ల నిండుగా డబ్బు తరలుతుంటే, వీటిని మే 13న పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ డబ్బు విశాఖపట్నం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదని అధికారులు వెల్లడించారు. ఇప్పటికీ తిరుపూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ కంటెయినర్లను పార్క్ చేసి గట్టి కాపలా పెట్టారు. ఇంత పెద్దమొత్తంలో డబ్బును పోలీసుల ఎస్కార్ట్ లేకుండా తీసుకువెళుతున్నారని, అంత డబ్బు తీసుకు వెళ్లేందుకు అధికారుల అనుమతి పత్రాలేవీ లేవని ఇళంగోవన్ తన పిటిషన్ లో ఆరోపించారు.