: నాకు తెలుసు... మనసుకు సర్దిచెప్పుకుని వచ్చిన మీకు ఇబ్బంది రానీయను: ఉద్యోగులతో చంద్రబాబు
"నాకు తెలుసు. ఉద్యోగులంతా మనసుకు సర్దిచెప్పుకుని, స్థిమితపరచుకుని ఇక్కడికి వచ్చారు. గుడ్ థింగ్. మీకెవరికీ ఇబ్బంది రానీయను. సమస్యలన్నీ పరిష్కరిస్తాను. ఇక్కడికి వచ్చిన ఉద్యోగులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారు మంచి స్ఫూర్తితో ముందుకు వచ్చారు. ఇక్కడున్న ఉద్యోగులు వారితో సోదరభావంతో మెలగాలి. వారికి స్వాగతం పలకడం శుభసూచకం" అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ, "అల్టిమేట్ గా ఆగస్టు నాటికి మొత్తం స్టెబిలైజ్ అవుతుంది. సంప్రదాయ ఆఫీసులా కాకుండా, వర్చ్యువల్ ఆఫీసులుగా తీర్చిదిద్దుతున్నాం. రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఆన్ లైన్ చేస్తాం. ఫైల్స్ రియల్ టైంలో టేబుల్స్ మారేలా ఏర్పాట్లు చేస్తున్నాం. దీని వల్ల పని సులభం అవుతుంది" అని పేర్కొన్నారు. శీతాకాలపు అసెంబ్లీ సమావేశాలను అమరావతిలోనే నిర్వహిస్తామని, ఈ మేరకు తాను ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు చంద్రబాబు వివరించారు. ఈలోగా మంచి రహదారుల నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. అధికారుల మధ్య సమన్వయ బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించినట్టు తెలిపారు.