: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ... నరేంద్ర మోదీ మనసులో ఏముంది?


ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఎట్టకేలకు తెరపైకి వచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ తన క్యాబినెట్ ను విస్తరించేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలివి. వయోవృద్ధులకు పదవీ విరమణ: వయసు మళ్లిన దశలో ఉన్న కేంద్ర మంత్రులు మోదీ క్యాబినెట్ లో కనిపిస్తున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి కైలాశ్ మహరాజ్, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లాలు 75 ఏళ్ల పైబడ్డారు. దీంతో వీరిద్దరినీ తొలగించవచ్చని ఇప్పటికే వార్తలు వచ్చాయి. వచ్చే సంవత్సరంలో ఖాళీ కానున్న ఉప రాష్ట్రపతి పదవికి నజ్మా హెప్తుల్లా పోటీ పడవచ్చని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆమెను ఏదైనా ఓ రాష్ట్రానికి గవర్నర్ గా పంపవచ్చన్న వార్తలూ వెలువడుతున్నాయి. అదే మోదీ మనసులో ఉంటే ఆమె తొలగింపు తప్పదు. పనితీరు బాగున్న మంత్రులకు ప్రమోషన్: మోదీ క్యాబినెట్ లో చక్కగా పనిచేస్తూ, మంచి పేరు తెచ్చుకున్న మంత్రులకు ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కష్టపడి పనిచేస్తారన్న పేరు తెచ్చుకున్న విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్, చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లపై మోదీ మనసులో ఏముందో అన్నది మరో 24 గంటలు సస్పెన్సే. ఇక వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ విషయమే ఇంకా తెలియట్లేదు. నజ్మాను మైనారిటీ శాఖ నుంచి తొలగించే పక్షంలో ముఖ్తార్ అబ్బాస్ నక్వీకి ఆ పదవి లభించవచ్చని సమాచారం. ఖాళీలు పూరించాలి: సామాజిక న్యాయ శాఖ మంత్రి విజయ్ సాంప్లాను పంజాబ్ బీజేపీ చీఫ్ గా, యువజన వ్యవహారాలు, క్రీడా శాఖా మంత్రి శర్వానంద సోనోవాల్ ను అస్సాం ముఖ్యమంత్రిగా ఇప్పటికే పంపడంతో, ఈ రెండు పదవులూ ఖాళీగా ఉన్నాయి. ఇక అరుణ్ జైట్లీ వద్ద ఆర్థిక శాఖతో పాటు సమాచార, ప్రసారాల శాఖ కూడా ఉంది. ఆయన్ను ఆర్థిక శాఖకు మాత్రమే పరిమితం చేయాలన్నది మోదీ అభిమతంగా తెలుస్తోంది. ఎన్నికల రాష్ట్రాలకు ప్రాధాన్యం: 2017లోగా ఉత్తరప్రదేశ్ సహా 7 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గోవా, గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనుండగా, ఈ రాష్ట్రాల నుంచి కొత్త మంత్రుల చేరిక ఖాయంగా కనిపిస్తోంది. యూపీలోని ఇతర వెనుకబడిన వర్గాల ఓట్లపై కన్నేసిన బీజేపీ, అప్నా దళ్ ఎంపీ అనుప్రియా పటేల్ కు చాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాప్-4 మంత్రులపై: పాలనలో అత్యంత కీలకమైన హోం, ఆర్థిక, విదేశాంగ, రక్షణ శాఖల విషయం వరకూ ఎలాంటి మార్పు చేర్పులకూ అవకాశం లేదని తెలుస్తోంది. టాప్-4 మంత్రిత్వ శాఖల విషయమై ఫిర్యాదులేమీ లేనందున రాజ్ నాథ్, జైట్లీ, సుష్మ, పారికర్ లు తమ తమ పదవుల్లోనే కొనసాగనున్నారు.

  • Loading...

More Telugu News