: ఈనెల 8 నుంచి గడప గడపకూ వెళతాం.. ప్రభుత్వ వైఖరిని ఎండ‌గ‌డ‌తాం: మాజీ ఎంపీ వెంక‌ట్రామిరెడ్డి


హైద‌రాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న పార్టీ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, ప‌లువురు కార్య‌క‌ర్త‌లు స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. వైసీపీ ఈనెల 8 నుంచి ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమాన్ని చేప‌ట్టనుంది. దీనిపై ఈరోజు జ‌రుగుతోన్న స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్నారు. ఈ సందర్భంగా అక్క‌డ‌కు చేరుకున్న మాజీ ఎంపీ అనంత వెంక‌ట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర‌, కేంద్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ‘ప‌రిపాల‌న‌లో రెండేళ్లు పూర్తియింది.. అభివృద్ధి ఎక్క‌డా..?’ అని ఆయ‌న ప్ర‌శ్నించారు. కేంద్రం ఇచ్చిన హామీలు అమ‌లు చేస్తోన్న దాఖ‌లాలు క‌న‌ప‌డ‌డం లేదని, హామీల‌ను సాధించ‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. టీడీపీ నేత‌లు ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల్లో ఒక్క‌టి కూడా అమ‌లు చేయ‌లేద‌ని వెంక‌ట్రామిరెడ్డి అన్నారు. ప్ర‌జ‌ల్లో ఆత్మ‌స్థైర్యం నింప‌డం కోస‌మే తాము ప్ర‌తిష్ఠాత్మ‌కంగా గ‌డ‌ప గ‌డ‌ప‌కు వైఎస్సార్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నామ‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌జ‌లు రాష్ట్ర ప్ర‌భుత్వ‌ పాల‌న‌పై న‌మ్మ‌కం కోల్పోయారని ఆయ‌న వ్యాఖ్యానించారు. ‘ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇస్తాం.. రాష్ట్ర వ్యాప్తంగా కార్య‌క‌ర్త‌లు, నేత‌లు క‌ల‌సి ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ ఇంటింటికీ తిరుగుతారు’ అని ఆయ‌న చెప్పారు. ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌తో ప్రభుత్వం భూమిలాక్కుంటోందని ఆయ‌న ఆరోపించారు.

  • Loading...

More Telugu News