: దేవాలయాల తొలగింపు అధికారుల అత్యుత్సాహమేనట!... తమకు ఆ ఉద్దేశమే లేదన్న మంత్రివర్యులు!
విజయవాడ కార్పొరేషన్ అధికారుల అత్యుత్సాహం కారణంగానే విజయవాడలో రహదారుల విస్తరణ వివాదాస్పదం అయిందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, దేవాలయాలు తొలగించాలన్న ఆలోచన తమకు ఏనాడూ లేదని చెప్పుకొచ్చారు. జరిగిన తప్పు ఉద్దేశ పూర్వకంగా జరిగినది కాదని తెలిపారు. గోశాల, కృష్ణుడి దేవాలయం తొలగింపు, ఆంజనేయుడు, వినాయకుడి గుడుల తొలగింపులో తప్పు జరిగిపోయిందని అన్నారు. వీటిని పునర్నిర్మించే చర్యలు చేపడతామని తెలిపారు. కృష్ణా పుష్కరాలకు వచ్చే ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని, వారి రాకపోకలకు వీలుగా ఏర్పాట్లు చేయాలన్న సదుద్దేశంతో మాత్రమే అధికారులు విస్తరణ చేపట్టారని, అయితే, సమన్వయలేమి, అత్యుత్సాహంతో తొందర పడ్డారని అన్నారు. ఇకపై ఇటువంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ప్రభుత్వ పెద్దల సలహాలు, సూచనలు లేకుండా అధికారులు వారంతట వారుగా ఆక్రమణల తొలగింపు పేరిట దేవాలయాలను కూల్చేంత ధైర్యం చేయగలరా? అన్న ప్రశ్నకు మాణిక్యాలరావు సమాధానం ఇవ్వలేదు. విజయవాడలో దేవాలయాల కూల్చివేతలు వివాదాస్పదం అవుతూ, చంద్రబాబు సర్కారుకు అప్రతిష్ఠ తెస్తున్న వేళ, తప్పు అధికారులదేనంటూ వారిని బాధ్యులను చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ సహా వైకాపా, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే విమర్శల బాణాలు గుప్పించాయి. ఇప్పుడు తాజాగా మంత్రి మాణిక్యాలరావు సైతం ఆ మాటే చెప్పడం గమనార్హం.