: తెలుగు రాష్ట్రాల మధ్య ‘పాల’ పోరు!... ‘విజయ’ బ్రాండ్ పాలపై ఇరు రాష్ట్రాల భిన్న ప్రకటనలు!


తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ ఏపీ, తెలంగాణల మధ్య మరిన్ని వివాదాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకంపై పెను వివాదమే నడుస్తోంది. తాజాగా ప్రైవేట్ డెయిరీలకు ఎదురొడ్డి తన ప్రత్యేకతను చాటుకుంటున్న ప్రభుత్వ పాల ఉత్పత్తుల సంస్థ ‘ఏపీ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (ఏపీ డెయిరీ)’ ఉత్పత్తి చేస్తున్న ‘విజయ’ బ్రాండ్ పాలపై ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదం చోటుచేసుకుంది. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడివడినా... విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్ లో చేరిన ఏపీ డెయిరీ మాత్రం ఇంకా ఉమ్మడిగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ కేంద్రంగా పాల వ్యాపారం చేస్తున్న ఏపీ డెయిరీ... ‘విజయ’ బ్రాండ్ పాలను తెలంగాణలోనూ విక్రయిస్తోంది. అయితే ఈ విషయాన్ని మొన్నటిదాకా అంతగా పట్టించుకోని తెలంగాణ సర్కారు తాజాగా ‘తెలంగాణ పాడి సమాఖ్య’ పేరిట ప్రత్యేక సంస్థను నెలకొల్పుకుని ‘విజయా’ బ్రాండ్ పేరిటే పాలను విక్రయిస్తోంది. అయితే ఆ బ్రాండ్ కు ‘తెలంగాణ’ అనే ట్యాగ్ లైన్ తగిలించింది. ఇక ఏపీ డెయిరీ... తెలంగాణలోని పాలమూరు జిల్లా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సాంబశివ డెయిరీ ప్రొడక్ట్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కు తన పాలను పంపి అక్కడే ప్రాసెస్ చేయించి ‘విజయ’ బ్రాండ్ పేరిటే తెలంగాణలో పాలను విక్రయిస్తోంది. ఈ క్రమంలో సాంబశివ డెయిరీ నుంచి వస్తున్న ‘విజయ’ బ్రాండ్ తమది కాదని మొన్న తెలంగాణ పాడి సమాఖ్య ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనకు కౌంటర్ గా నిన్న ఏపీ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ జి.మురళి మరో ప్రకటన విడుదల చేశారు. సాంబశివ డెయిరీ నుంచి విడుదలవుతున్న ‘విజయ’ బ్రాండ్ పాలు నకిలీవి కావని, వాటిలో ఎలాంటి కల్తీ లేదని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News