: ఇక రష్యా టూర్ కు చంద్రబాబు!.. ఈ నెల 9న ఫ్లైటెక్కనున్న ఏపీ సీఎం!
నవ్యాంధ్రకు పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చేస్తున్న విదేశీ పర్యటనలు సత్ఫలితాలనే ఇస్తున్నాయి. ఈ మేరకు ఇటీవలే చైనాలో ఐదు రోజుల పాటు పర్యటించి వచ్చిన చంద్రబాబు... త్వరలోనే వేలాది కోట్ల మేర పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నట్లు ప్రకటించారు. తాజాగా మరో కీలక దేశం రష్యాలో పర్యటించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ‘ఇండస్ట్రియల్ నెట్’ థీమ్ తో రష్యాలో జరగనున్న అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్ ‘ఇన్నోప్రోమ్-2016’ లో పాల్గొనేందుకు చంద్రబాబు నిర్ణయించారు. ఈ నెల 10 నుంచి 14 వరకు రష్యా నగరం ఎకతెరిన్ బర్గ్ లో జరగనున్న ఈ సదస్సుకు చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, వసుంధర రాజే కూడా హాజరవుతున్నారు. అయితే ఈ ట్రేడ్ ఫెయిర్ కు ఏపీనే కంట్రీ పార్టనర్ గా వ్యవహరిస్తోంది. ఈ సదస్సు కోసం చంద్రబాబు ఈ నెల 9ననే రష్యా విమానం ఎక్కనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా ప్రధాని మెద్వెదేవ్, ఆ దేశ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి, ఎకతెరిన్ బర్గ్ గవర్నర్లతో చంద్రబాబు భేటీ అవుతారు.