: బంగ్లాదేశ్ మారణకాండ వెనుక పాకిస్థాన్ హస్తం
ఢాకాలోని ఓ రెస్టారెంటుపై దాడి చేసి 20 మందిని బలిగొన్న ముష్కరుల వెనుక పాకిస్థాన్ ఐఎస్ఐ ఉందని బంగ్లాదేశ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశంలో నిషేధించబడ్డ జమాత్ - ఉల్ - ముజాహిద్దీన్ కు ఐఎస్ఐ సహకారం ఎప్పటి నుంచో అందుతూ ఉందని, వారి ప్రోద్బలమే ఈ దాడులకు పురికొల్పిందని ప్రధాని షేక్ హసీనాకు రాజకీయ సలహాదారుగా ఉన్న హుస్సేన్ తౌఫీక్ వ్యాఖ్యానించారు. ఐఎస్ఐ, జమాత్ ల మధ్య ఉన్న దగ్గరి బంధం గురించి అందరికీ తెలిసిందేనని, వారు ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర పన్నారని ఆయన అన్నారు. దాడికి పాల్పడిన వారంతా విద్యాధికులేనని, యూనివర్శిటీ విద్యను అభ్యసించారని బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జామన్ ఖాన్ వెల్లడించారు. కాగా, ఈ ఉగ్ర ఘటనలో 20 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.