: నమ్మాల్సిందే... ఇండియాలోని ఓ ఫేక్ యూనివర్శిటీ కథ ఇది!


అలీగఢ్... ఈ ప్రాంతంలోని వారికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్శిటీ అనే పేరు వినబడుతున్నదే. అయితే ఆ పేరిట ఓ భవనంగానీ, లేదా సైన్ బోర్డునుగానీ చూసిన వారు మాత్రం ఎవరూ ఉండరు. ఎవరినైనా అడిగినా కూడా పేరు విన్నామే తప్ప, ఎక్కడుందో తెలీదన్న సమాధానమే వస్తుంది. ఇక ఇదే యూనివర్శిటీని యూజీసీ 'ఫేక్'గా ప్రకటించిన నేపథ్యంలో ఈ వర్శిటీ గురించి ఆరా తీయగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఈ వర్శిటీ ఓ ఆయుర్వేద దుకాణంలో సాగుతోంది. అవును నిజమే. జీర్ణక్రియను పెంచే వివిధ చూర్ణాలను అమ్ముకునే శ్యామ్ సుందర్ శర్మ ఈ యూనివర్శిటీకి వైస్ చాన్స్ లర్. ఇక్కడో వర్శిటీ ఉందని, దానికి వీసీ శ్యామ్ సుందరేనని అటూ ఇటూ ఉన్న దుకాణాల వారికి తెలుసు. ఇక దీని గురించి ప్రశ్నిస్తే తన యూనివర్శిటీ కథను చెప్పుకొచ్చాడు శర్మ. ఓ ప్రముఖ ఆయుర్వేద వైద్యుడి కుమారుడినైన తాను బీఎస్సీ పాస్ కాలేకపోయానని, ఆపై ఆగ్రా యూనివర్శిటీ నుంచి సోషల్ సర్వీస్ విభాగంలో సర్టిఫికెట్ కోర్సు చేశానని తెలిపారు. తాను సుభాష్ చంద్రబోస్ అభిమానినని, 1990 ప్రాంతంలో ఆయన పేరిట వర్శిటీని తెరవాలని భావించానని తెలిపాడు. జిల్లా ఉన్నతాధికారులు యూనివర్శిటీని ఏర్పాటు చేసేందుకు భూమిని ఇవ్వకపోవడంతో చిన్న గదిలో తరగతులు ప్రారంభించామని వివరించారు. వర్శిటీలో కేవలం 5వ తరగతి వరకూ మాత్రమే బోధించామని, 90 మంది విద్యార్థులు ఉండేవారని చెప్పుకొచ్చాడు. ఆపై విద్యార్థులను మోసం చేస్తున్నాడన్న ఆరోపణలతో పోలీసులు శర్మను అరెస్ట్ చేయగా, ఆ కేసు ఇప్పటికీ నడుస్తోంది. తాను 26 సంవత్సరాలుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నానని, తీర్పు అనంతరం యూనివర్శిటీని అభివృద్ధి చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక యూజీసీ నిబంధనల గురించి శర్మకు ఏ మాత్రం తెలియవట. కనీసం పదేళ్ల పాటు బోధనా రంగంలో అనుభవం లేకుంటే వర్శిటీ వైస్ చాన్స్ లర్ గా ఉండకూడదన్న నిబంధన గురించి చెప్పగా, కాస్తంత కన్ ఫ్యూజ్ అయిన శర్మ, తాను కాకుంటే మరో వ్యక్తిని వీసీగా పెట్టుకుంటానని చెప్పడం గమనార్హం.

  • Loading...

More Telugu News