: తప్పు బీసీసీఐది...గంగూలీకి జవాబిచ్చిన రవిశాస్త్రి
టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి ఇంకా కలల ప్రపంచం నుంచి బయటకు రాలేకపోతున్నట్టు కనబడుతోంది. ఎంత రాద్దాంతం చేసినా ఉపయోగం లేదని తెలిసినా, అహాన్ని సంతృప్తి పరుచుకునేందుకు తనను ఎంపిక చేయకపోవడం ద్వారా రేపిన వివాదానికి ముగింపు పలకలేకపోతున్నారు. తాజాగా గంగూలీ ఘాటు వ్యాఖ్యలకు ఆయన జవాబిస్తూ, హాలీడే కోసం జూన్ 15న థాయ్ లాండ్ వెళ్లానని, అయినప్పటికీ జూన్ 19 వరకు బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నానని అన్నారు. ఇంటర్వ్యూ తేదీని బీసీసీఐ అకస్మాత్తుగా ప్రకటించిందని, ఈ విషయం కోచ్ అభ్యర్థులెవరికీ తెలియదని రవిశాస్త్రి తెలిపాడు. దీంతో బీసీసీఐ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూలో పాల్గొనే అవకాశం కల్పించిందని శాస్త్రి వెల్లడించాడు. ఇలా ఇంటర్వ్యూలో పాల్గొన్నది తాను ఒక్కడినే కాదని, టామ్ మూడీ కూడా ఇలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూలో పాల్గొన్నాడని గుర్తుచేశాడు. వారికి, తనకు తేడా ఏంటని రవిశాస్త్రి గంగూలీని మరోసారి ప్రశ్నించాడు. కాగా, బీసీసీఐ రెండు రోజుల ముందు కోచ్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఇదే వివాదానికి కారణమైందన్నట్టు శాస్త్రి మాట్లాడడం విశేషం. అయితే టీమిండియా ప్రధాన కోచ్ అంశంపై గత నెల రోజులుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుత కాలంలో రెండు రోజుల వ్యవధిలో ప్రపంచంలోని ఏ మూలనుంచి ఏ మూలకైనా చేరుకోవచ్చు. డైరెక్టర్, కామెంటేటర్ గా భారీ పారితోషికం తీసుకునే రవిశాస్త్రి లాంటి వ్యక్తికి స్వయంగా హాజరుకావడం పెద్ద విషయం కాదన్న సంగతి తెలిసిందే. దీనిపై గంగూలీ ఏమంటాడో చూడాలి!