: టీటీడీకి రెండు బస్సులను విరాళంగా ఇచ్చిన భక్తుడు
తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడికి ఆయన భక్తులు నగదు, ఆభరణాల రూపంలో భారీగా విరాళాలు సమర్పించుకునే సంఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. ఆయన సన్నిధికి చేరుకునేందుకు, దేవస్థాన కార్యక్రమాల అవసరాలకు వాహనాలను కూడా విరాళంగా ఇచ్చే సంఘటనలు జరుగుతున్నాయి. ఇటీవలే ఓ సంస్థ శ్రీవారికి ఓ లారీని విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కోల్కతాకు చెందిన ప్రకాశ్చౌదరి అనే భక్తుడు వెంకన్నకు రెండు బస్సులను విరాళంగా ఇచ్చారు. ఈరోజు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి, ఈ బస్సు సేవలను ప్రారంభించారు. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఉచితంగా ఈ రెండు బస్సుల సేవలు అందించనున్నారు. ధర్మరథాలుగా పేరు పెట్టిన ఈ రెండు బస్సుల ఖరీదు రూ.24.50 లక్షలు. భక్తులు తిరుమలేశుడి సన్నిధికి చేరుకోవడానికి అనువుగా, అన్ని సౌకర్యాలతో ఈ బస్సులను తయారుచేశారు.