: దాడుల నుంచి రక్షణ కోసం ‘తుపాకులు’ కొంటున్న మహిళలు.. ‘గన్’లకు పెరుగుతున్న డిమాండ్


ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతీ రోజూ మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ చర్యలు, పకడ్బందీ చట్టాలు దాడులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్య నుంచి మొన్నటికి మొన్న చెన్నైలోని రద్దీ రైల్వే స్టేషన్‌లో ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య వరకు.. దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. దాడులు జరిగినప్పుడు హడావుడి చేసే ప్రభుత్వాలు, పోలీసులు ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోతుండడంతో మహిళ రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఎవరో వచ్చి తమను రక్షిస్తారని భావించడం కంటే తమ రక్షణను తామే చూసుకునేందుకు మహిళలు మొగ్గుచూపుతున్నారు. పెప్పర్ స్ప్రేలాంటివి పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో తుపాకులపై దృష్టిసారిస్తున్నారు. అయితే అవి నిజమైన తుపాకులు కావు.. అచ్చం అలా కనిపించే బొమ్మ తుపాకులన్న మాట. అంతమాత్రాన అవి భయపెట్టలేవనుకోవద్దు. నిజమైన తుపాకికి ఏమాత్రం తీసిపోని ఇవి వాటిలానే పెద్ద శబ్దంతో పేలుతాయి. కాబట్టి ఆపద సమయంలో వీటిని చూపించి తప్పించుకోవచ్చు. గతమూడు నాలుగు సంవత్సరాలుగా ఈ తుపాకులను కొనే మహిళల సంఖ్య 30-40శాతం పెరిగినట్టు చెన్నైలోని ఎయిర్‌సాఫ్ట్ గన్ ఇండియా సేల్స్ రిప్రజెంటేటివ్ విక్రమ్ పేర్కొన్నారు. 2012లో నిర్భయ ఘటన తర్వాత తుపాకుల అమ్మకాలు విపరీతంగా పెరిగినట్టు చెప్పారు. తమ వినియోగదారుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, మహిళలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ తుపాకులు కలిగి ఉండడం నేరం కాకపోవడంతో అమ్మకాలు పెరిగినట్టు ఆయన చెప్పారు. ఇప్పుడీ తుపాకులు పలు రూపాల్లో లభిస్తున్నాయి. సెల్‌ఫోన్‌లా ఉండే స్టెన్‌గన్, జంతువుల నుంచి రక్షణకు ఉపయోగించే ఎయిర్ గన్ తదితరాలు ఇప్పుడు మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. తుపాకుల కోసం ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నుంచి ఆర్డర్లు వస్తున్నట్టు ఢిల్లీకి చెందిన యాక్షన్ ఇండియా చెబుతోంది. మూడు సంవత్సరాల క్రితం వచ్చిన సెల్‌ఫోన్ స్టెన్‌గన్ కోసం 200కు పైగా ఆర్డర్లు వచ్చినట్టు పేర్కొంది. ఇక తుపాకులతోపాటు మహిళలు కొనుగోలు చేస్తున్న వాటిలో పెప్పర్ స్ప్రే, మడతపెట్టగలిగే లాఠీలు, దాడుల నుంచి రక్షించే పెన్నులు ఉన్నాయి. చూడడానికి మామూలుగా ఉండే ఈ పెన్నులు దాడుల నుంచి రక్షించడమే కాకుండా డీఎన్ఏను సేకరించగలవు. కాబట్టి దర్యాప్తులో కూడా ఈ పెన్నులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News