: పాప కాదు... తండ్రికి కంటిపాప!


ఫిలిప్పీన్స్ కు చెందిన ఐదేళ్ల జెన్నీ అందరికీ పాపలా కనిపించినా పెద్ద బాధ్యతను తలకెత్తుకుంది. కళ్లులేని తండ్రి నెల్సన్ పెపెను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. డొడొంగ్ అని పిలుచుకునే నెల్సన్ కొబ్బరితోటల్లో రోజు కూలీగా పని చేస్తాడు. అంధుడైన డొడొంగ్ ఏ పని చేయాలన్నా అతనికి ఒకరి తోడు అవసరం. కనీసం బయటకు వెళ్లాలన్నా ఒకరు తీసుకెళ్లాల్సిందే. అలాంటి డొడొంగ్ కు చిన్నారి దిక్సూచిగా మారింది. తండ్రి చేసే ప్రతిపనికి ముందుండి నడిపిస్తుంది. ఒక పొడుగాటి కర్రను ఒక చివర తండ్రి పట్టుకుంటే, రెండో చివర తను పట్టుకుని తీసుకెళ్తుంది. ఓ రోజు ఇలా వెళ్తున్న తండ్రి, కుమార్తెను చూసి చలించిపోయిన రూబీ కపునెస్ అనే యువతి వారి ఫోటో తీసి, వారిని ఆదుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో తండ్రికూతుళ్ల ఫోటోను పోస్టు చేసింది. ఈ ఫోటోలను 24 లక్షల మంది వీక్షించగా, పలువురు వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఏబీఎస్‌-సీబీఎన్‌ ఫౌండేషన్‌ సభ్యులు అయితే ఏకంగా ఫిలిప్పీన్స్‌ వెళ్లి జెన్నీ, నెల్సన్‌ లను కలిశారు. వారిని మనీలా తీసుకువెళ్లి నెల్సన్‌ కు కంటి పరీక్షలు చేయించారు. జెన్నీని బాగా చదివించి ప్రయోజకురాలిని చేయాలని నిర్ణయించారు. ఓ యువతి చేసిన చిన్న పని ఓ తండ్రికి ఆశ్రయం కల్పిస్తే, ఓ బాలికకు ప్రయోజనం చేకూర్చింది.

  • Loading...

More Telugu News