: ఉమా భారతితో చంద్రబాబు భేటీ!... చర్చల కోసం కార్యదర్శిని రప్పించిన కేంద్ర మంత్రి!
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ ముగియగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కేంద్ర జలనవరుల శాఖ మంత్రి ఉమా భారతి వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయని భావించిన ఉమా భారతి... తన శాఖ కార్యదర్శి అమర్ జిత్ సింగ్ ను తన కార్యాలయానికి పిలిపించారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, తన్నీరు హరీశ్ రావుల మధ్య అమర్ జిత్ సింగ్ సమక్షంలోనే వరుస భేటీలు జరిగాయి. ఈ నేపథ్యంలో నాడు ఇరు రాష్ట్రాల మంత్రులు ఏమేం చెప్పారన్న విషయాన్ని చంద్రబాబుకు తెలిపేందుకు అమర్ జిత్ సింగ్ ను ఉమా భారతి పిలిపించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ విషయంపై చంద్రబాబు, ఉమా భారతి మధ్య కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశాలున్నాయి.