: ఎర్రవల్లి చౌరస్తాలో ఉద్రిక్తత!... హైవేపై ఆందోళనకు దిగిన డీకే అరుణ, సంపత్ అరెస్ట్
తెలంగాణలో ప్రత్యేక జిల్లాల కోసం జరుగుతున్న ఉద్యమాలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. అటు ఉత్తర తెలంగాణలో వరంగల్ జిల్లా జనగామలో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వి వాహనాలను ధ్వంసం చేయడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. మరోవైపు దక్షిణ తెలంగాణలోని పాలమూరు జిల్లాలోనూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గద్వాలను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ ఎర్రవల్లి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా డీకేకు మద్దతుగా తన అనుచరులతో కలిసి ఆందోళనకు వచ్చారు. దీంతో అక్కడ పెద్ద సంఖ్యలో గుమిగూడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు. దీంతో అక్కడ కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డీకే అరుణ, సంపత్ కుమార్ లను అరెస్ట్ చేసేందుకు యత్నించారు. అయితే పోలీసులను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిఘటించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు డీకే అరుణ, సంపత్ లను అరెస్ట్ చేశారు.