: పాతబస్తీలో హైటెన్షన్!... పోలీసుల చక్రబంధంలో భాగ్యలక్ష్మీ ఆలయం, 10 మసీదులు


భాగ్యనగరి హైదరాబాదులో బీభత్సం సృష్టించేందుకు పథక రచన చేసిన ఐఎస్ ఉగ్రవాదుల అరెస్ట్, రంజాన్ మాసంలో చివరి శుక్రవారం నాడు వేలాది మంది ముస్లింల సామూహిక ప్రార్థనలతో నగరంలోని పాతబస్తీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదుల వ్యూహాలకు సంబంధించి సమగ్ర సమాచారం వెల్లడైనా... ఇంకా వెల్లడి కాని పథకాలేమైనా ఉన్నాయేమోనన్న అనుమానాలు పోలీసులను పట్టి పీడిస్తున్నాయి. అరెస్టైన ఉగ్రవాదులను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తే తప్పించి ఈ విషయంలో నెలకొన్న సందిగ్ధత తొలగే అవకాశం లేదు. అదే సమయంలో ముస్లింల పవిత్ర మాసం రంజాన్ నెలలో చివరి శుక్రవారం కావడంతో మక్కా మసీదుతో పాటు అన్ని మసీదుల్లో వేలాది మంది ప్రార్థనలకు తరలివస్తున్నారు. అదే సమయంలో చార్మినార్ కు సమీపంలోని హిందూ ఆలయం భాగ్యలక్ష్మీ టెంపుల్ లోనూ నేడు హిందువులు భారీ ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ పరిస్థితి కట్టుతప్పుతుందోనన్న భయంతో పోలీసులు పెద్ద ఎత్తున సాయుధ బలగాలను రంగంలోకి దింపారు. పాతబస్తీ పరిధిలోని మక్కా మసీదు సహా మరో 9 మసీదులు, భాగ్యలక్ష్మి టెంపుల్ పరిసరాలను పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. మసీదు, ఆలయాల వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఓ వైపు ముస్లింల ప్రార్థనలు, మరోవైపు హిందువుల పూజలు, ఇంకోవైపు ఉగ్రవాదుల వ్యూహాలపై పోలీసుల అనుమానాలు... వెరసి పాతబస్తీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News