: చిన్న సాంకేతిక సమస్య వల్లే తెలంగాణ ఉద్యోగులు ఫైళ్లను అడ్డుకున్నారు: ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర
అమరావతికి 80 శాతం ప్రభుత్వ కార్యాలయాలు తరలొచ్చాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈరోజు ఉదయం విజయవాడలో బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రజలకు అందుబాటులో ఉండాలనే విజయవాడలో బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించామని ఆయన తెలిపారు. బీసీ సంక్షేమ శాఖకు చెందిన కామన్ ఫైల్స్ సాఫ్ట్ కాపీస్ తెలంగాణకు ఇచ్చామని ఆయన అన్నారు. చిన్న సాంకేతిక సమస్య వల్ల తెలంగాణ ఉద్యోగులు ఫైళ్లను అడ్డుకున్నారని తెలిపారు. సమస్యను పరిష్కరించి త్వరలోనే ప్రక్రియను పూర్తి చేస్తామని అన్నారు.