: సుబ్రహ్మణ్యస్వామి తగ్గలేదు!... మోదీ ‘అచ్చే దిన్’పై బీజేపీ ఫైర్ బ్రాండ్ ఘాటు వ్యాఖ్య!
బీజేపీ ఫైర్ బ్రాండ్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి తన పదునైన వ్యాఖ్యలకు ఏమాత్రం ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. ఇప్పటికే సొంత పార్టీ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో పాటు ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ లపై వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్వామి... ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీపైనా గళం విప్పారు. తాజాగా నేటి ఉదయం ఆయన తన ట్విట్టర్ ఖాతాలో మోదీని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘వాస్తవ జీడీపీ గణాంకాలను బయటకు తీస్తే... ‘అచ్చే దిన్’పై జనం గగ్గోలు పెట్టడం ఖాయం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీని అధికారంలోకి తెచ్చిన ‘అచ్చే దిన్’ నినాదాన్నే ఆధారం చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెను దుమారాన్నే రేపనున్నాయి. సొంత పార్టీ ప్రభుత్వంపైనా స్వామి ఈ తరహా వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణించే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. సుబ్రహ్మణ్య స్వామిపై చర్యలు తప్పవన్న వార్తలూ వస్తున్నాయి.