: ముసుగు లేకుండా మీడియా ముందుకు జిషా హత్యకేసు నిందితుడు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జిషా హత్యకేసు నిందితుడు అమీరుల్ ఇస్లాంను పోలీసులు మొట్టమొదటిసారి ముఖానికి ముసుగు లేకుండా మీడియా ముందు ప్రవేశపెట్టారు. గురువారం అమీరుల్ను జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడికి కోర్టు ఈనెల 13 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ సందర్భంగా 'నీ నుంచి ఏమైనా ఫిర్యాదులన్నాయా?' అన్న మెజిస్ట్రేట్ ప్రశ్నకు అమీరుల్ స్పందిస్తూ ఏమీ లేవని పేర్కొన్నాడు. అనంతరం నిందితుడిని కక్కనాద్ జిల్లా కోర్టుకు తరలించారు. ఐడెంటిఫికేషన్ పెరేడ్, ఇతర విచారణల నేపథ్యంలో నిందితుడిని ఇప్పటి వరకు ముఖానికి ముసుగు లేకుండా చూపించలేకపోయామని కేసును దర్యాప్తు చేస్తున్న ఏడీజీపీ బి.సంధ్య పేర్కొన్నారు. దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశముండడంతో నిందితుడి ఫొటోలను ప్రచురించవద్దని అప్పట్లో డీజీపీ లోకనాథ్ బెహ్రా మీడియాను కోరిన సంగతి తెలిసిందే. కాగా గురువారం ప్రొసీడింగ్స్ అన్నీ పూర్తికావడంతో అమీరుల్కు ముసుగు లేకుండానే పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.