: కాసులు కురిపిస్తున్న విద్యార్థుల ఐఐటీ కల.. ఏడాదికి రూ.3వేల కోట్లు ఆర్జిస్తున్న ప్రైవేటు కాలేజీలు
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో చదవాలన్న విద్యార్థుల కల తెలుగు రాష్ట్రాల్లోని ప్రయివేటు కాలేజీలకు కాసుల పంట పండిస్తోంది. ఐఐటీ పేరుతో ఈ కాలేజీలు ఏడాదికి రూ.3వేల కోట్లకు పైగా ఆర్జిస్తున్నాయి. తమ కుమారుడు ఐఐటీలో బీటెక్ చదవాలని కోరుకుంటున్న తల్లిదండ్రుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడం కాలేజీలకు వరంగా మారింది. వారి కలను నెరవేర్చేందుకు వివిధ ప్రోగ్రాముల పేరుతో కాలేజీలు ముందుకొస్తున్నాయి. ఇంటర్మీడియెట్‌లోనే కొన్ని కాలేజీలు ఇంటిగ్రేటెడ్ కోచింగ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ప్రతీ రోజూ బోర్డు సిలబస్‌తోపాటు ఐఐటీ పాఠాలు బోధిస్తున్నాయి. కొన్ని స్కూళ్లయితే ఆరో తరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్ అని ఊదరగొడుతున్నాయి. ఇంటర్మీడియెట్‌తోపాటు రెండేళ్ల ఐఐటీ కోచింగ్‌కు ప్రైవేటు కళాశాలలు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. జేఈఈలో ఎలాగైనా తమ కుమారుడు జయకేతనం ఎగురవేయాలనే ఉద్దేశంతో కొందరు తల్లిదండ్రులు హాస్టల్ వసతితో కలుపుకుని ఏడాదికి రూ.3.5 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఇక ఐఐటీ ఫౌండేషన్ స్కూళ్లయితే ఏడాదికి రూ.70 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. ప్రతీ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షన్నర మంది విద్యార్థులు జేఈఈ(మెయిన్) పరీక్షకు హాజరవుతున్నారు. వీరిలో 80 శాతం మంది ప్రైవేటు కళాశాలల నుంచి వచ్చినవారు కావడం గమనార్హం. ఈ విషయంపై కాంగ్రెస్ నేత, విద్యా నిపుణుడు కె.వెంకటస్వామి మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రుల ఐఐటీ కలను కళాశాలలు పక్కా వ్యాపారంగా మార్చుకుంటున్నాయని అన్నారు. ఐఐటీ కల విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోందన్నారు. ఇంటి దగ్గర ఉండి చదువుకునేవారు ప్రతీరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, అదే రెసిడెన్సియల్ కాలేజీలో చదువుకుంటున్న వారైతే రాత్రి పది గంటల వరకు ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా ఇటువంటి పరిస్థితి లేదని వెంకటస్వామి పేర్కొన్నారు.