: గుంటూరు నుంచి నవ్యాంధ్ర రాజధానికి ఇరవై నిమిషాలకో ఆర్టీసీ బస్సు
గుంటూరు నుంచి వెలగపూడికి ఇరవై నిమిషాలకో ఆర్టీసీ బస్సు అందుబాటులోకి వచ్చింది. గుంటూరు నుంచి వయా తాడికొండ, తుళ్ళూరు మీదుగా ఈ బస్సులు సచివాలయానికి రాకపోకలు సాగించనున్నాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఆర్టీసీ సర్వీసులు అందుబాటులో ఉంటాయని రీజనల్ మేనేజర్ శ్రీహరి పేర్కొన్నారు. మంగళగిరి నుంచి తుళ్లూరు వరకు వయా సచివాలయం మీదుగా రాకపోకలు సాగించేలా అదనపు సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. రెయిన్ ట్రీ పార్కు నుంచి ఉదయం 8.45 గంటలకు, 9.05 గంటలకు, సచివాలయం నుంచి రెయిన్ ట్రీ పార్కునకు సాయంత్రం 5.00, 5.20 గంటలకు బస్సు సర్వీసులున్నాయన్నారు. అదేవిధంగా గుంటూరులోని గుజ్జనగుండ్ల నుంచి సచివాలయానికి, సచివాలయం నుంచి గుజ్జనగుండ్లకు మరికొన్ని సర్వీసులు ఏర్పాటు చేసినట్లు శ్రీహరి చెప్పారు.