: ఇప్పుడు అనుభవిస్తున్నదే అతి పెద్ద పదవి... ఇంతకన్నా ఇంకో మెట్టు ఎక్కను: హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్య
తన జీవితంలో ఇప్పుడు నిర్వహిస్తున్న నీటి పారుదల శాఖ మంత్రి పదవి అతిపెద్దదని, ఇంతకన్నా పెద్ద పదవి తనకు రాదని కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ వారసుడిగా తదుపరి సీఎం బాధ్యతలు కేటీఆర్ కు వస్తాయా? లేక హరీశ్ కు వస్తాయా? అన్న చర్చ సాగుతున్న వేళ, హరీశ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తనను ఆదరించిన మెదక్ ప్రజల రుణాన్ని తన చేతిలో పదవి ఉన్న సమయంలోనే తీర్చుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉదయం సంగారెడ్డిలో దాదాపు గంటకు పైగా విలేకరులతో ముచ్చటించిన ఆయన, ఎన్ని అడ్డంకులు ఎదురైనా కొమరవెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం ఆగబోదని తెలిపారు. నీళ్లు ఉంటేనే రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయవచ్చని, నీరుండాలంటే ప్రాజెక్టులు తప్పనిసరని వ్యాఖ్యానించిన ఆయన, భూ సేకరణ తప్పదని, భూములు పోగొట్టుకునే వారికి న్యాయం చేసి తీరుతామని అన్నారు. ముంపునకు గురయ్యే ఊర్లకు బదులుగా, మరింత మంచి, అభివృద్ధి చేసిన ఊర్లను బదులిస్తామని అన్నారు. పాత ఊర్ల మాదిరే కొత్త ఊర్లుంటాయని, వాటిల్లో సర్పంచ్ లు, ఎంపీటీసీలు పాతవారే ఉండేలా చట్టాన్ని సవరిస్తామని చెప్పారు. ఈ చేత్తో చెక్కు తీసుకుని, ఆ చేత్తో భూములను రాసివ్వాలని కోరారు.