: రైతులను రూ. 2 కోట్లకు మోసం చేసి... పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయిన ప్రభాకర్ శర్మ
రైతుల వద్ద మిరపకాయలు కొనుగోలు చేసి, వారికి చెల్లించాల్సిన రూ. 2 కోట్లను ఎగ్గొట్టిన కేసులో ఐదు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రభాకర్ శర్మ, పోలీసులకూ టోకరా ఇచ్చాడు. ప్రకాశం జిల్లా పర్చూరు పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. విచారణ నిమిత్తం ఆయన్ను పోలీసులు స్టేషన్ లో ఉంచగా, ఈ తెల్లవారుఝామున తప్పించుకున్నాడు. పోలీసుల వైఫల్యం కారణంగానే ప్రభాకర్ పారిపోయాడని రైతులు విమర్శిస్తున్నారు. ప్రభాకర్ పారిపోవడంపై మరో కేసును పోలీసులు నమోదు చేయగా, ఉన్నతాధికారులు ఘటనపై సీరియస్ అయ్యారు. దీనిపై విచారణకు ఆదేశించిన ప్రకాశం ఎస్పీ, బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.