: అత్యాచార బాధితురాలితో మహిళా కమిషన్ సభ్యురాలి సెల్ఫీ... సోషల్ మీడియాలో వైరల్


సెల్ఫీల పైత్యానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. బాధితురాలిని ఓదార్చాల్సిన బాధ్యతగల మహిళా సభ్యురాలు ఒకరు ఆమెతో సెల్ఫీ దిగడం వివాదాస్పదమవుతోంది. వాట్సాప్‌లో ఇప్పుడా ఫొటో వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని అంబర్ సమీపంలో కట్నం ఇవ్వలేదన్న కోపంతో భార్యపై భర్త, అతని ఇద్దరు సోదరులు అత్యాచారానికి పాల్పడి ఆపై ఆమె నుదిటిపై అసభ్యకర పచ్చబొట్టు వేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రాజస్థాన్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సుమన్ శర్మ, సభ్యురాలు సోమ్యా గుర్జార్ బాధితురాలిని కలిసేందుకు మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ బాధితురాలితో గుర్జార్ సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీలో సుమన్ శర్మ కూడా కనిపిస్తున్నారు. గుర్జార్ సెల్ఫీ దిగుతుండగా ఎవరో దానిని ఫొటో తీసి వాట్సాప్‌లో పోస్టు చేశారు. బాధితురాలితో నవ్వుతూ సెల్ఫీ దిగుతున్న గుర్జార్‌ను చూసిన నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ సెల్ఫీపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో స్పందించిన చైర్‌పర్సన్, గుర్జార్‌ను లిఖిత పూర్వక వివరణ కోరారు. కాగా ఆమె సెల్ఫీ తీస్తున్న సమయంలో తాను బాధితురాలితో మాట్లాడుతున్నానని, తనకు, ఆ సెల్ఫీకి ఎటువంటి సంబంధం లేదని శర్మ పేర్కొన్నారు. ఇటువంటి విషయాలను తాను సహించబోనని, రేపటిలోగా వివరణ ఇవ్వాలని ఆమెను ఆదేశించినట్టు శర్మ తెలిపారు.

  • Loading...

More Telugu News