: ట్రిపుల్ తలాక్ అంశం చాలా సీరియస్ విషయమని అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు ధర్మాసనం


ముస్లిం సంప్రదాయంలో వివాహ రద్దు (విడాకుల) కోసం ఆచరణలో ఉన్న తలాక్ (ట్రిపుల్ తలాక్) విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ, ముస్లిం పర్సనల్ లాబోర్డులో సంస్కరణలు కావాలంటూ ముస్లిం మహిళలు చేస్తున్న ఆన్ లైన్ పోరాటానికి ఫలితం దక్కేలా కనిపిస్తోంది. తలాక్ అనైతికం అంటూ ఆ విధానం రద్దు చేయాలని కోరుతూ 50,000 మంది ముస్లింలు సంతకాలు కూడా చేశారు. ఈ మేరకు దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ కేసులో విచారణ సందర్భంగా మీడియాను నిరోధించాలంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది. ఈ సందర్భంగా ట్రిపుల్ తలాక్ అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. దీనికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను పరిశీలించాలంటూ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. ఇది చాలా తీవ్రమైన అంశమని చెప్పిన బెంచ్ పెద్ద సంఖ్యలో ప్రజా జీవితాలకు సంబంధించిన ఇది అతి ముఖ్యమైన అంశమని పేర్కొంది. ట్రిపుల్ తలాక్ ను రాజ్యాంగ ముసాయిదాలోని అంశాల గీటురాయిగా, గత తీర్పుల ఆధారంగా పరిశీలించాల్సి ఉందని పేర్కొన్న చీఫ్ జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్, ఈ విషయంలో చట్టపరమైన సమస్యల వివరాలు రూపొందించాలని ప్రతివాదులకు సూచించింది. ట్రిపుల్ తలాక్ అంశం రాజ్యాంగం ఆమోదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా భావిస్తే...ముస్లింల మత, వ్యక్తిగత చట్టాల్లో జోక్యం చేసుకుని, వారిని ఒప్పించాలని ధర్మాసనం సూచించింది. ఈ అంశంలో అవసరమయితే ఐదుగురు న్యాయమూర్తులతో సుదీర్ఘ బెంచ్ ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. దీనిపై తదుపరి విచారణకు సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News